Moral Story 05

💦 *నీతి కథలు - 05*


*బానిసత్వం-ఆండ్రోక్లిస్*

చాలా కాలం క్రితం గ్రీసు దేశంలో ఒక బానిస ఆండ్రోక్లిస్ ఉండేవాడు. బానిసల్ని జంతువులకన్నా హీనంగా చూసే రోజులవి. ఇప్పుడు పశువుల సంతలున్నట్లు, ఆ రోజుల్లో బానిసల సంతలుండేవి. బానిసలతోటి యజమానులు ఏ పనైనా చేయించుకోవచ్చు.

యజమాని ఏ పని చెబితే బానిస ఆ పని చేయాలి. అట్లా చేయకపోతే చక్రవర్తిగారు బానిసల్ని శిక్షిస్తారు. బానిసలు యజమానినుండి పారిపోయేందుకూ వీలులేదు. సైనికులు పట్టుకుంటారు, పులులకీ, సింహాలకీ ఆహారంగా వేస్తారు.

ఆండ్రోక్లిస్ చాలా మంచివాడు. సున్నిత మనస్కుడు. కొంచెం పెద్దయ్యే సరికి అతనికి తన బానిస బ్రతుకుపైన విరక్తి కలిగింది: 'జీవితం అంటే స్వేచ్ఛగా బ్రతకటమే! స్వేచ్ఛలేని బ్రతుకు వృధా' అని నిశ్చయించు-కున్నాడు. యజమాని ఆదమరుపున ఉండగా తెగించి అడవిలోకి పారిపోయాడు!

అట్లా అడవిలో పోతూ ఉంటే, ఒక గుహ బయట అతనికి ఒక సింహం కనిపించింది. అది గర్జించడం లేదు- పెద్దగా ఒకలాగా మూలుగుతోంది. సింహాన్ని చూడగానే ఆండ్రోక్లిస్‌కు భయం వేసింది. పరుగెడదామనుకున్నాడు. అయితే సింహం బలంగా లేదు- తన వెంట పడటం లేదు! తనపైకి దూకే పరిస్థితుల్లో కూడా అది లేదు! 'ఎందుకు?' అని ఆశ్చర్యం వేసింది అతనికి.

వెనక్కి తిరిగి, మెల్లగా నడచుకుంటూ సింహం దగ్గరకు వెళ్ళాడు. సింహం అతన్ని చూసింది; కానీ కదిలే ప్రయత్నం చెయ్యలేదు. ఆండ్రోక్లిస్ మెల్లగా సింహాన్ని ముట్టుకున్నాడు. అది ఏమీ అనలేదు. పశువులతో పని చేసిన ఆండ్రోక్లిస్‌కు అది ఎందుకనో బాధ పడుతున్నదని అర్థం అయ్యింది. పరీక్షగా చూస్తే దాని కాలు బాగా వాచి ఉంది- పంజాలో పెద్ద ముల్లు గుచ్చుకుని ఆ బాధ వల్ల సింహం నడవలేకుండా ఉన్నది. స్వతహాగా మంచివాడైన ఆండ్రోక్లిస్ ఇక ఏమీ ఆలోచించలేదు. కూర్చొని, సింహం కాలును తన ఒళ్ళో పెట్టుకొని, జాగ్రత్తగా దాని పంజాలో ఉన్న ముల్లును ఊడబెరికాడు. పంజాకున్న చీమునంతా శుభ్రపరచాడు. వెళ్లి, తనకు తెలిసిన ఆకులు తెచ్చి, పసరు పిండి, కట్టు కట్టాడు. అది తాగేందుకు ఒక దొన్నెలో కాసిని నీళ్ళు తెచ్చి పెట్టాడు. కాసేపటికి, 'ఇక సింహం లేచి తిరగగలదు' అనిపించగానే తను బయటికి వెళ్ళిపోయాడు.

అటుపైన అడవిలో చెట్లమీదా, గుహల్లో దాక్కొని, ఎవరికీ కనబడకుండా తిరుగుతూ వచ్చాడు. అట్లా ఒక రెండు మూడు నెలలు గడిచాయి. ఒకరోజున అకస్మాత్తుగా యజమాని పంపిన సైనికుల చేతికి దొరికిపోయాడు. ఆండ్రో క్లిస్‌ని విచారించి శిక్షవేయటం చక్రవర్తికి ఏమాత్రం కష్టం కాలేదు. పని ఎగగొట్టి తప్పించుకొని పారిపోయి, మళ్ళీ దొరికిన బానిసలనుి పులికో సింహానికో ఆహారంగా వెయ్యాలి! ఆ క్రూర మృగం అతన్ని ముక్కలు ముక్కలు చేసి చప్పరించేస్తుంటే సామాన్య ప్రజలందరూ చూడాలి- 'ఓహో! పారిపోతే తమ గతి కూడా ఇట్లా అవుతుందా!' అని మిగిలిన బానిసలందరూ యజమానులకు అణగి మణిగి ప్రవర్తించేట్లుండాలి, ఇదంతా!

అంతకు కొద్ది రోజుల క్రితం చక్రవర్తి తన పరివారంతో సహా వేటకు వెళ్ళినప్పుడు ఒక సింహం వాళ్ళ మీదికి దూకింది. దృఢంగా, బలంగా ఉన్న ఆ సింహం పంజా దెబ్బలకు ఇద్దరు ముగ్గురు సైనికులు నేలకొరిగారు కూడాను. వాళ్ళకు అది ఒకపట్టాన దొరకలేదుగానీ, మిగిలిన సైనికులు అందరూ కలిసి దాన్ని లొంగదీశారు. ఇనప సంకెళ్ళు వేసి దాన్ని అన్నివైపులనుండీ బిగించారు.

ప్రభువులవారు తమ శౌర్యం ఎంతటిదో ప్రకటించుకోవటం కోసం దాన్ని ఓ బోనులో పెట్టి అడవినుండి పట్నానికి తీసుకొచ్చారు. అడవిలో స్వేచ్ఛగా పెరిగిన ఆ సింహం వీళ్ల మాటలు ఊరికే ఎందుకు వింటుంది? వినలేదు. దగ్గరకొచ్చిన సైనికుడి మీదికల్లా దూకిందది. దాన్ని లొంగదీయడం కోసం చక్రవర్తుల వారు చాలా రోజులుగా దానికి ఎలాంటి ఆహారమూ ఇవ్వలేదు. తిండిపెట్టకుండా ఉంచారు.

ఆకలికి మాడి, తిండికోసం తపించి తపించి, చివరికది వాళ్ళు చెప్పినట్లు వింటుంది- సర్కసుల్లో ఉండే క్రూరమృగాలన్నీ అట్లా శిక్షణ పొందినవే గద!

అయితే ఈ సింహం ఇంకా ఎవరి అదుపులోకీ రాలేదు. ఆకలితో నకనకలాడుతున్నది కూడాను; ఎవరు దగ్గరకొస్తే వాళ్ళ మీదికి దూకుతున్నది. పారిపోయి దొరికిన బానిస ఆండ్రోక్లిస్‌ని ఆకలిగొన్న ఆ సింహానికి ఆహారంగా వెయ్యాలని నిర్ణయించబడింది. ప్రభువుల వారికి ఇదంతా వినోదం. ఆకలిగొన్న సింహం బానిస మీదికి దూకి, కండ కండనూ‌ చీల్చుకొని తింటుంటే వారు వినోదంగా చూసి సంతోష పడతారు. సింహం బలాన్ని మెచ్చుకుంటారు. అలాంటి సింహం తన ఆధీనంలో ఉన్నందుకు గర్వ పడతారు. ఆ రోజుల్లో చక్రవర్తుల వినోదాలు అలా ఉండేవి.

వినోదం చూడటానికి చక్రవర్తి తన పరివారంతో సహా వచ్చారు. గుంటలాగా ఉన్న గోదా మధ్యలో ఆండ్రోక్లిస్‌ని ఉంచారు. ఫుట్‌బాల్‌ ఆట చూసేందుకు వచ్చినట్లు, చుట్టూ ప్రేక్షకులు. అందరూ బానిసని వేలెత్తి చూపించారు. ఉమ్మి వేశారు, రాళ్ళు వేశారు. తమ బానిసలకు వాడిని చూపించి భయపెట్టారు.

కొంత సేపటికి సింహం ఉన్న బోనును బరిలోకి తెచ్చారు. బోనులో సింహం క్రోధంతో తిరుగాడుతున్నది. ఆకలి లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆకలిగా ఉన్నప్పుడు అంత భీకరంగా ఉంటుంది సింహం. దాని గర్జనలతో గోదా అంతా ప్రతిధ్వనించింది.

ప్రేక్షకులు ఉత్సాహంతో చప్పట్లు చరిచారు. ఈలలు వేశారు. ఆ చప్పుళ్ళకు రెచ్చి పోయిన సింహం 'బోను ఊచల్ని విరిచేస్తుందా' అన్నట్లు రెచ్చిపోయి బోనులోనే కదం తొక్కింది. ప్రాణభయంతో ఆండ్రోక్లిస్ గోదా అవతలి అంచుకు పరుగు పెట్టాడు. అటు ప్రక్కన గోడకు ఒదిగి ముడుచుకొని కూర్చున్నాడు. ప్రేక్షకులంతా వాడిని ఎగతాళిచేశారు.

మళ్ళీ ఓసారి రాళ్ల వాన కురిసింది. జనాల అరుపులు-కేకలతో ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనించింది. చక్రవర్తులవారు విలాసంగా నవ్వారు. సింహాన్ని వదలమని సైగ చేశారు.

సైనికులు గోదా పైనుండి కొక్కీలతో బోను తలుపు తెరిచారు. దారి కానక తన్నుకులాడుతున్న సింహం ఒక్కసారిగా గర్జిస్తూ ముందుకు దూకింది. దూరంగా ఒదిగి కూర్చొని వణికిపోతున్న బానిసవాడిని చూసి, మెరుపులాగా అటు వైపుకు ఉరికింది. ఒక్క క్షణంలో వాడి ముందు వాలింది. అంతటా నిశ్శబ్దం..ఉత్కంఠ. మహోగ్ర కెరటం మాదిరి, అది ఇక బానిస మీదికి విరుచుకు పడాలి.

ప్రేక్షకులందరూ చూస్తున్నారు.. చక్రవర్తి, పరివారం, సైనికులు అందరూ ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు.. ఆండ్రోక్లిస్ తన ప్రాణాలమీద ఆశ వదిలేసుకున్నాడు..

సింహం బానిస దగ్గరికి వెళ్ళి వాసన చూసింది. వాడి కాలిని నాకింది. ఆండ్రోక్లిస్ కళ్ళు మూసుకున్నాడు- భగవంతుడిని తలచుకుంటూ. సింహం వాడి చుట్టూ తిరిగింది, మళ్ళీ‌ మళ్ళీ‌వాడి కాలిని నాకింది. వాడి చొక్కాను పట్టుకొని పడేసి, వాడి మీద వాలి, వాడి ముఖాన్ని నాకింది..అటూ ఇటూ ఎగిరి నాట్యం చేసింది. వాడి చేతులు నాకింది.. చివరికి వాడి ఒడిలో ఒదిగి కూర్చొని గారాలు పోయింది!

అప్పుడు గుర్తు పట్టాడు ఆండ్రోక్లిస్- 'ఇది తనకు తెలిసిన సింహమే! తను దాన్ని గుర్తించలేదు గానీ, అది తనను గుర్తించింది! మనుషులలో లేని ప్రేమ,ఆప్యాయతలు దీనిలో ఉన్నాయి. అవును- ఇదీ తనలాగా బానిసే, ప్రేమకు బానిస మరి! బానిసను బానిస గుర్తించటంలో ఆశ్చర్యం ఏమున్నది?' ఆండ్రోక్లిస్ కూడా‌ దాన్ని ప్రేమగా నిమిరాడు.

చక్రవర్తి ఇరకాటంలో పడ్డాడు. 'ఎవరికైనా సరే, ఒక తప్పుకు ఒకసారే శిక్ష వేయాలి' అని ఆ రోజుల్లో నియమం. 'ఇప్పుడు వేరే సింహానికి వీడిని ఆహారంగా వేసేందుకు వీలు లేదు. ఇట్లా ఎందుకు జరిగింది?' ఆయన ఆండ్రోక్లిస్‌ను తన దగ్గరికి పిలిపించుకొని అడిగాడు- 'నీ దగ్గర ఏం మందు ఉన్నది?' అని.

ఆండ్రోక్లిస్ జరిగింది చెప్పి, అన్నాడు- "బానిసలు మాత్రమే తోటి బానిసల్ని, వాళ్ళ బాధల్ని గుర్తించగలరు ప్రభూ"అని. చక్రవర్తి నిర్ఘాంతపోయాడు. ఆయన నోట మాట రాలేదు. ఆండ్రోక్లిస్ అన్న మాట ఆయన హృదయాన్ని కదిలించింది. 'బానిసలూ మనుషులేగా, వాళ్లని వేరుగా ఎందుకు చూస్తున్నాం?' అని ప్రశ్నించుకునేట్లు చేసింది.

మరుసటి రోజున ఆండ్రోక్లిస్ బానిసత్వం రద్దు చేయబడింది. సింహానికి కడుపునిండా ఆహారం‌ పెట్టి, దాన్ని అడవిలో వదిలేశారు. గ్రీకు రాజ్యంలో మొదటిసారిగా 'బానిసలూ మనుషులే, వారికీ స్వేచ్ఛ ఉండాలి' అని ఆలోచించటం మొదలైంది.
      
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" నీకు మంచి జరగాలని కోరుకున్నట్లే ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకో "_
      _*- స్వామి వివేకానంద*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు "_

         💦🐋🐥🐳💦  💦🐋🐥🐬💦